గుడ్డు పగలగొట్టగానే ముదురు నారింజ రంగులో పచ్చసొన కనిపిస్తే చాలామంది అది మంచి నాణ్యత ఉన్న గుడ్డని భావిస్తారు. పోషకాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. సోషల్‌ మీడియాలో కూడా ఇలాంటి గుడ్లను ‘ప్రీమియం’గా చూపించే వీడియోలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ పచ్చసొన రంగు ఒక్కటే గుడ్డు నాణ్యతను చెప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పచ్చసొన రంగు కోడి జాతిని బట్టి మారదు. అది కోడి తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మొక్కజొన్న, ఆకుకూరలు, బంతిపూలు, ఎర్ర మిరప, క్యాప్సికం లాంటి కెరోటినాయిడ్లు ఎక్కువగా ఉండే ఆహారం తింటే పచ్చసొన ముదురు నారింజ రంగులోకి మారుతుంది. అదే ఈ పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పచ్చసొన లేత పసుపు రంగులో ఉంటుంది.

చాలామంది ముదురు రంగు పచ్చసొన ఉన్న గుడ్లు తప్పనిసరిగా ఫ్రీరేంజ్‌ కోళ్లవే అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బయట తిరిగే కోళ్లు సహజంగా గడ్డి, పురుగులు తినడం వల్ల అలాంటి రంగు రావచ్చు. అదే ఆహారాన్ని ఫారాల్లో పెంచే కోళ్లకు ఇస్తే వాటి గుడ్లలో కూడా అదే రంగు కనిపిస్తుంది.

ముదురు పచ్చసొనలో ల్యూటిన్‌, జియాక్సాంథిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవి కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అయినా ప్రొటీన్‌, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు, క్యాలరీల పరంగా లేత పచ్చసొన గుడ్లకు, ముదురు వాటికి పెద్దగా తేడా ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి.

వినియోగదారుల అభిరుచిని బట్టి రైతులు కోళ్ల ఆహారాన్ని కూడా మార్చుతుంటారు. బంతిపూలు, మిరప, ఇతర సహజ పదార్థాలు కలిపిన మేత ఇస్తే పచ్చసొన మరింత ముదురు రంగులో కనిపిస్తుంది. అంటే రంగు మారడానికి కారణం గుడ్డు కాదు.. కోడి తిన్న ఆహారమే.

అందుకే గుడ్డు నాణ్యతను పచ్చసొన రంగుతో మాత్రమే అంచనా వేయకూడదు. గుడ్డు ఎంత తాజాగా ఉంది? ఎలా నిల్వ చేశారు? కోళ్లను ఎలా పెంచారు? వంటి అంశాలే అసలు నాణ్యతను నిర్ణయిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.