అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 14న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘పళ్ల బురుసు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నాగార్జున.. ఇది కేవలం వినోదాత్మక చిత్రం మాత్రమే కాదని, ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలను చూపించే సినిమా అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆగస్టు 14 నుంచి థియేటర్లలో తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరారు.
ట్రైలర్ ఆరంభం నుంచే ఆసక్తిని పెంచుతోంది. తన కొడుకు టూత్‌బ్రష్ కొనివ్వలేదంటూ ఓ వృద్ధుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. చిన్న విషయానికి పోలీస్ కేసా అంటూ అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోతారు. అయితే కథ ముందుకు సాగేకొద్దీ తండ్రి మనసులోని బాధ బయటపడుతుంది. కొడుకుతో పెరిగిన దూరం, తన మాట వినిపించాలనే తండ్రి తపనను దర్శకుడు భావోద్వేగంగా చూపించాడు.
‘పళ్ల బురుసు’ ట్రైలర్‌లో మరో సన్నివేశం మరింత ఆసక్తి కలిగిస్తుంది. కథానాయకుడు తన సమాధిని తానే తవ్వుకుంటూ కనిపిస్తాడు. ఆ సన్నివేశం వెనుక ఉన్న కారణం ఏంటన్న ఆసక్తిని ట్రైలర్ పెంచింది. హాస్యాన్ని, భావోద్వేగాలను సమంగా మేళవిస్తూ కుటుంబ బంధాల్లో వస్తున్న మార్పులను సినిమా చూపించబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ‘పళ్ల బురుసు’ చిత్రాన్ని నిర్మించాయి. గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రలు పోషించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించగా, వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.
నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్.. కథలో ఊహించని మలుపు..
