ఆపరేషన్‌ థియేటర్‌లో ప్రాణం కోసం పోరాటం జరుగుతోంది. అదే సమయంలో భూమి ఒక్కసారిగా బలంగా కంపించింది. గోడలు వణికాయి.. పరికరాలు కదిలిపోయాయి.. అయినా వైద్యులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. రోగిని వదిలి బయటకు వెళ్లకుండా, ఆపరేషన్‌ టేబుల్‌ను గట్టిగా పట్టుకుని అతణ్ని కాపాడారు. జపాన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

జపాన్‌లోని కుమమోటోలో ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతుండగా 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా ఆపరేషన్‌ థియేటర్‌ మొత్తం ఊగిపోయింది. లైట్లు కంపించాయి. వైద్య పరికరాలు కదిలిపోయాయి. వైద్య సిబ్బంది నిలబడటానికే ఇబ్బంది పడినా రోగిని మాత్రం వదల్లేదు.

వీడియోలో కొందరు వైద్యులు ఆపరేషన్‌ టేబుల్‌ కదలకుండా గట్టిగా పట్టుకుని కనిపించారు. మరో వైద్యుడు కదులుతున్న పరికరాన్ని అదుపు చేసే ప్రయత్నంలో కిందపడిపోయాడు. అయినా వెంటనే లేచి తన బాధ్యతను కొనసాగించాడు. భూకంపం తగ్గే వరకు వైద్య బృందం రోగికి రక్షణగా నిలిచింది.

భూకంపం కారణంగా శస్త్రచికిత్సను కొద్దిసేపు నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆపరేషన్‌ను ప్రారంభించారు. చివరకు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు జపాన్‌ మీడియా వెల్లడించింది. కొద్ది రోజులకే ఆసుపత్రి సాధారణ సేవలను తిరిగి ప్రారంభించింది.

జులై 28 మధ్యాహ్నం జపాన్‌లోని క్యుషూ ద్వీపాన్ని 7.1 తీవ్రతతో భూకంపం తాకింది. ఈ ఘటనలో సుమారు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 120 మందికిపైగా గాయపడ్డారు. అనేక ఇళ్లు కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వేలాది ఇళ్లకు విద్యుత్‌, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వేలాది మంది సహాయ శిబిరాలకు తరలిపోయారు. ఈ ప్రకంపనలు దక్షిణ కొరియాలో కూడా నమోదయ్యాయి.