అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఆర్క్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రకృతిలో లేని కొత్త వైరస్‌లను రూపొందించారు. వాటిలో 16 వైరస్‌లు ప్రయోగశాలలో విజయవంతంగా పనిచేశాయి. ఇవి మనుషులు, జంతువులు, మొక్కలకు హాని చేయవు. బ్యాక్టీరియాపై మాత్రమే దాడి చేస్తాయి. ఈ పరిశోధన సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఈ వైరస్‌లను రూపొందించేందుకు శాస్త్రవేత్తలు ఈవో-1, ఈవో-2 పేర్లతో ఉన్న ఏఐ మోడళ్లను ఉపయోగించారు. చాట్‌జీపీటీ పదాలను అంచనా వేసినట్లు, ఈ మోడళ్లు డీఎన్‌ఏలో వచ్చే అక్షరాల క్రమాన్ని అంచనా వేస్తాయి. లక్షలాది జన్యు సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత పూర్తిగా కొత్త వైరస్‌ల నమూనాలను రూపొందించాయి.
ఏఐ రూపొందించిన లక్షల నమూనాల్లో దాదాపు 300ను ఎంపిక చేసి ప్రయోగశాలలో తయారు చేశారు. వాటిని బ్యాక్టీరియాలో పరీక్షించగా 16 వైరస్‌లు విజయవంతంగా పనిచేశాయి. వాటిలో కొన్ని సహజంగా ఉండే వైరస్‌ల కంటే వేగంగా పెరిగాయి. మరికొన్ని సహజ వైరస్‌లకు నిరోధక శక్తిని పెంచుకున్న ఈ.కోలై బ్యాక్టీరియాను కూడా సమర్థంగా నాశనం చేశాయి.
యాంటీబయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాపై పోరాటంలో ఈ పరిశోధన ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అవసరానికి అనుగుణంగా కొత్త వైరస్‌లను రూపొందించి ప్రమాదకర బ్యాక్టీరియాను ఎదుర్కోవచ్చని చెబుతున్నారు.
అయితే ఈ విజయంతో పాటు ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైరస్‌ల జన్యు నిర్మాణాన్ని ఏఐతో రూపొందించే సాంకేతికత అందుబాటులోకి వచ్చినా, దాన్ని నియంత్రించే స్పష్టమైన నిబంధనలు ఇంకా లేవని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉపయోగించిన మోడల్‌లో మనుషులు, జంతువులు, మొక్కలకు సోకే వైరస్‌ల సమాచారాన్ని చేర్చలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఈ ప్రయోగాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ఏఐతో కొత్త వైరస్ సృష్టించిన శాస్త్రవేత్తలు.. ప్రపంచంలో తొలిసారి..
