తెలంగాణలో యాప్ ఆధారిత వాహన, ఫుడ్ డెలివరీ సేవలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి క్యాబ్ సర్వీసులతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి ఫుడ్ డెలివరీ సేవలు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు గిగ్ వర్కర్ల 'జాయింట్ యాక్షన్ కమిటీ' (జేఏసీ) ప్రకటించింది. హైదరాబాద్ నాంపల్లిలోని గిగ్ ఆఫీసులో సమావేశమైన 16 సంఘాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సరైన స్పందన లేకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫారం వర్కర్స్ రూల్స్‌ను అమలు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. యాప్ ఆధారిత రవాణా సేవలకు కనీస ఛార్జీ, కిలోమీటర్‌కు, నిమిషానికి న్యాయపరమైన ఛార్జీలను నోటిఫై చేయాలని కోరుతున్నారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలకు అనుగుణంగా కనీస ఛార్జీలు నిర్ణయించి, డ్రైవర్లు, డెలివరీ సిబ్బందికి స్థిరమైన ఆదాయం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమతో సమావేశమై పలు హామీలు ఇచ్చారని, వాటిని ఇంతవరకు నెరవేర్చలేదని జేఏసీ నేతలు గుర్తు చేస్తున్నారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రత్యేక యాప్‌ను తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ ఆ హామీలు అమలుకు నోచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ సంస్థలు అమలు చేస్తున్న అన్యాయమైన ఛార్జీల వల్ల తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, అందుకే సమ్మె తప్ప మరో మార్గం లేదని వారు స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 16 సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని, ప్రజలు తమకు సహకరించాలని వారు కోరుతున్నారు. ఈ సమ్మెతో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికులు, ఫుడ్ డెలివరీ సేవలపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.