ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయేలోని నూతన మిత్రపక్షాలకు, ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), శివసేన (ఉద్ధవ్ వర్గం) నుంచి వచ్చిన రెబల్ ఎంపీలకు కీలక భరోసా ఇచ్చారు. "ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను మీకు అండగా ఉంటాను" అని ఆయన అభయమిచ్చారు. శుక్రవారం ఉదయం తన నివాసంలో సుమారు 45 మంది ఎన్డీయే ఎంపీలతో ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు పదేపదే అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో తృణమూల్ రెబల్స్‌తో ఏర్పడిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ), ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన శివసేన ఎంపీలు, ఎన్సీపీ (అజిత్ పవార్) సభ్యులు పాల్గొన్నారు. సభలో గందరగోళం కారణంగా కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం రాకపోవడం అన్యాయమని ప్రధాని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. పార్లమెంటు చరిత్రను అధ్యయనం చేసి, చర్చలకు సిద్ధం కావాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందని పేర్కొంటూ, తమ నియోజకవర్గాల అభివృద్ధి పనుల నిమిత్తం నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.

"ఎన్డీయే ఒక కుటుంబం. కూటమిలోని ప్రతి పార్టీకి, ప్రతి ఎంపీకి తగిన గౌరవం ఉంటుంది. నేను ప్రతి ఎంపీకి అండగా ఉంటాను" అని మోదీ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడారు. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన షిండే వర్గం ఎంపీలతో మరాఠీలో సంభాషించడం విశేషం.