విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు-2026 (FCRA)పై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చేసిన విమర్శలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని, దీనిపై ఇతరుల వ్యాఖ్యలు అనవసరమని స్పష్టం చేసింది. విదేశీ నిధుల నియంత్రణకు సంబంధించి అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేసింది.

అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి రైలీ మూర్ ఆగస్టు 4న మాట్లాడుతూ, ఎఫ్‌సీఆర్ఏ బిల్లు క్రైస్తవులపై జరుగుతున్న స్పష్టమైన దాడి అని ఆరోపించారు. ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దయినా లేదా పునరుద్ధరణ జరగకపోయినా.. చర్చిలు, మతపరమైన స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకునే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ విమర్శలపై గురువారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. భారత్‌లో చట్టాల రూపకల్పనకు పటిష్ఠమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఉందని, దేశీయ చట్టాలను సరైన కోణంలో అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.

విదేశాల నుంచి వచ్చే విరాళాలను నియంత్రించే 2010 నాటి చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ కొత్త బిల్లును ప్రతిపాదించింది. దీని ప్రకారం, ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దయిన లేదా గడువు ముగిసిన సంస్థల ఆస్తులను, విదేశీ విరాళాలను నిర్వహించడానికి ప్రభుత్వం నియమించిన అధికారికి అధికారాలు లభిస్తాయి. అయితే, ప్రార్థనా స్థలాల మతపరమైన స్వభావాన్ని యథాతథంగా కాపాడతామని ఈ బిల్లులో స్పష్టం చేశారు.